🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

అమృత్–2.0 ద్వారా ఏడాదిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం హామీ
అర్హులందరికీ ప్రతి నెలా నిర్ణీత సమయానికే సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 13వ డివిజన్ మరడాని రంగారావు కాలనీలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు.

వృద్ధులు, మంచానికే పరిమితమైన రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, స్థానికుల సమస్యలను కూడా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తాగునీటి సమస్యను ప్రస్తావించగా, అమృత్–2.0 పథకం కింద రానున్న ఏడాది కాలంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

