The Desk … Eluru : మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళలకు టోకరా…అంతర్రాష్ట్ర మోసగాడు అరెస్ట్

The Desk … Eluru : మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళలకు టోకరా…అంతర్రాష్ట్ర మోసగాడు అరెస్ట్

🔴 ఏలూరు జిల్లా ముదినేపల్లి : ది డెస్క్ :

మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వివాహం పేరుతో మహిళలను మోసం చేసి నగదు, బంగారం కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్ నేతృత్వంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం :

గుంటూరు జిల్లా పాండురంగనగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) తాను మీడియా సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నానని, కుటుంబ నేపథ్యం ఉన్నత స్థాయిలో ఉందని నమ్మబలికి మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు. 2020 నుంచి ఇప్పటివరకు 40 మందికిపైగా మహిళలను వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి నగదు, బంగారం దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మహిళ నుంచి రూ.1 లక్ష నగదు, 10 కాసుల బంగారం కాజేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని కోదాడ, జంగారెడ్డిగూడెం, పరవాడ ప్రాంతాలకు చెందిన మహిళలను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 8 కాసుల బంగారు ఆభరణాలు, 6 సెల్‌ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 బ్యాంకు పాస్‌బుక్స్, 9 ఏటీఎం కార్డులు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, వివిధ దుస్తులు, అలాగే నేరాలకు వినియోగించిన మారుతి సుజుకి బలెనో కారు స్వాధీనం చేసుకున్నారు.

కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన కైకలూరు రూరల్ సీఐ వి. రవికుమార్, ఎస్‌ఐ వి.ఎస్.వి. భద్రరావు తదితర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.