The Desk … Vunguturu : శిథిలావస్థలో కైకరం బాలుర హాస్టల్…తరలింపుకు ప్రతిపాదనలు

The Desk … Vunguturu : శిథిలావస్థలో కైకరం బాలుర హాస్టల్…తరలింపుకు ప్రతిపాదనలు

🔴 ఏలూరు జిల్లా:ఉంగుటూరు మండలం : కైకరం : ది డెస్క్ :

24 మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎంపీడీవో చర్యలు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం వసతి గృహాన్ని సందర్శించిన ఉంగుటూరు ఎంపీడీవో జి.ఆర్. మనోజ్, భవనంలోని పలు గదులు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

ప్రస్తుతం హాస్టల్‌లో 24 మంది నిరుపేద విద్యార్థులు ఉంటుండగా, వసతి గృహాన్ని మూసివేస్తే వారి విద్యాభవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకటి లేదా రెండు గదులను తాత్కాలికంగా కేటాయించి హాస్టల్‌ను అక్కడికి తరలించేందుకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా విద్యాశాఖ అధికారులకు లేఖలు రాశారు.
విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర భారతి పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడితో గదుల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. కాగా, వేసవి సెలవుల సమయంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్ కొనసాగుతుందా..? లేక మూతపడుతుందా..? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.