🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ న్యూస్ :
పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు
➖జి.ఆర్. మనోజ్ (ఎంపీడీవో, సహాయ రిటర్నింగ్ అధికారి)
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలని ఉంగుటూరు ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ సూచించారు. ఏకగ్రీవ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.15 లక్షలు,
5 వేల నుంచి 10 వేల వరకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీకి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చన్నారు.
వ్యక్తిగత పట్టింపులకు పోకుండా అభ్యర్థులు, గ్రామ పెద్దలు చర్చించుకుని సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మండలంలోని గొల్లగూడెం పంచాయతీలో సర్పంచ్, అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయని, మరికొన్ని పంచాయతీలు, వార్డులు కూడా అదే దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.

