The Desk… Tadepalligudem : ఒక్క ఘటనతో వ్యక్తిత్వానికి తీర్పా..?!!!

The Desk… Tadepalligudem : ఒక్క ఘటనతో వ్యక్తిత్వానికి తీర్పా..?!!!

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

జర్నలిస్టు ఆత్మహత్య కేసులో చట్టం తన పని తాను చేస్తోంది..!!

కానీ కొన్నేళ్లుగా సంపాదించిన విశ్వాసాన్ని కూడా తూకం వేయాల్సిందే..!

ది డెస్క్ ప్రత్యేక విశ్లేషణ :

ఒక సంఘటన… ఒక ఆరోపణ… ఒక కేసు…!

ఇవి క్షణాల్లో ఒక వ్యక్తిని ప్రజల ముందే దోషిగా నిలబెట్టే పరిస్థితులు సృష్టిస్తాయి. కానీ న్యాయవ్యవస్థ మాత్రం మరో మాట చెబుతుంది. ఆరోపణలు, అరెస్టు, రిమాండ్ అనేవి దర్యాప్తులో భాగమే. తుది తీర్పు మాత్రం కోర్టుదే.

తాడేపల్లిగూడెంలో జర్నలిస్టు ఆత్మహత్య ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సెల్ఫీ వీడియోలో వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు తమ చట్టపరమైన విధులు నిర్వర్తించారు. కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. ఈ ప్రక్రియపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేయాల్సిందే.

అయితే మరో ప్రశ్న కూడా సమాజం ముందుకొస్తోంది.

తమ్మిశెట్టి రంగ సురేష్ అంటే ఎవరు..?

ఈ పేరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జర్నలిస్టు వర్గాలకు కొత్తది కాదు. రచ్చ మీడియా యూట్యూబ్ ఛానల్ అధినేతగా, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సంవత్సరాలుగా పనిచేస్తూ వృత్తిపరమైన గుర్తింపు సంపాదించిన వ్యక్తి.

సహచర జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం, వార్తల ప్రచురణలో ఆధారాలకు ప్రాధాన్యం ఇవ్వడం, తొందరపాటు నిర్ణయాల కంటే వాస్తవాలను పరిశీలించడం, అవసరమైనప్పుడు జర్నలిస్టులకు అండగా నిలవడం వంటి లక్షణాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా వరుసగా బాధ్యతలు నిర్వహించగలగడం కూడా సభ్యుల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుందని పలువురు చెబుతున్నారు.

అయితే ఇదే సమయంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు చట్టపరమైన విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా చట్టం కల్పించిన న్యాయ అవకాశాలు లభించాలి. ఇదే రాజ్యాంగ స్ఫూర్తి.

వృత్తి జీవితంలో విభేదాలు కొత్తవి కావు :

“మీడియా రంగం ప్రశంసలతో పాటు విమర్శల రంగం కూడా”… వార్తలపై అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత విభేదాలు, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, పరస్పర ఆరోపణలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ అవి విషాదాలకు దారి తీయకుండా పరస్పర సంయమనం అవసరమని సీనియర్ పాత్రికేయులు తరచూ సూచిస్తుంటారు.

ఒక్క కోణంతోనే తీర్పు ఇవ్వొద్దు :

ఒక వ్యక్తి జీవితాన్ని అంచనా వేయాలంటే అతను ఎదుర్కొంటున్న ఒక్క కేసును మాత్రమే కాదు… అతని గత సేవలను కూడా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో గత సేవలను చూపిస్తూ చట్టపరమైన ఆరోపణలను కూడా విస్మరించలేం.
అందుకే ఈ ఘటన మనందరికీ ఒక పాఠం చెబుతోంది.

ఆరోపణలు వేరు… ఆధారాలు వేరు… తీర్పు మరింత వేరు :

నిజం ఏదైనా కావచ్చు. దానిని తేల్చేది భావోద్వేగం కాదు… దర్యాప్తు.

సోషల్ మీడియా కాదు… సాక్ష్యాలు, ప్రజాభిప్రాయం కాదు… న్యాయస్థానం.

అంతవరకు ఎవరికీ ముందస్తు తీర్పు ఇవ్వకుండా, బాధితుడి విషాదాన్ని గౌరవిస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి చట్టబద్ధ హక్కులను కూడా గౌరవించడం సమాజం, మీడియా రెండింటి బాధ్యత.

✍️✍️ అత్యం విశ్వనాధ్
(ఎడిటర్ – ది డెస్క్, జాతీయ పత్రిక)