🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
మేయర్ పీఠం చిచ్చు.. టీడీపీలో అసమ్మతి సెగ..!
జనసేనకు కేటాయింపుపై తెలుగు తమ్ముళ్ల గుర్రు
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన నేతలు
ఏలూరు మేయర్ పీఠం కూటమిలో రాజకీయ కలకలం రేపుతోంది. మేయర్ పదవి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆశించిన ఆ పార్టీ నేతలకు, చివరి నిమిషంలో జనసేనకు కేటాయించారన్న ప్రచారం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ పరిణామంతో ఏలూరు టీడీపీలో అసమ్మతి స్వరాలు ఒక్కసారిగా పెరిగాయి. పది మంది క్లస్టర్ ఇన్చార్జిలు, 50 మంది డివిజన్ ఇన్చార్జిలు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు రాజీనామా పత్రాలు సమర్పిస్తామని వారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో మేయర్ పీఠం వ్యవహారం కేవలం పదవి కేటాయింపునకు పరిమితం కాకుండా, స్థానిక నాయకత్వం–పార్టీ అధిష్ఠానం మధ్య సమన్వయానికి పరీక్షగా మారింది.
గతంలోనూ ఇదే అసంతృప్తి…ఇప్పుడు ఏం జరుగుతుంది?
గతంలో దివంగత ఆళ్ల నాని టీడీపీలో చేరిన సందర్భంలోనూ.. ఏలూరు పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. అప్పట్లో అధిష్ఠానం సూచనలతో వెనక్కి తగ్గిన స్థానిక నేతలు, ఇప్పుడు మరోసారి అదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. గతంలో మాదిరిగానే అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గి రాజీనామాల ఆలోచనను విరమించుకుంటారా? లేక తమ నిరసనను కార్యరూపంలోకి తీసుకెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది..?
కూటమి రాజకీయాల్లో భాగంగా మేయర్ పీఠాన్ని జనసేనకు కేటాయించడంపై టీడీపీ స్థానిక నేతల్లో నెలకొన్న అసంతృప్తిని పార్టీ పెద్దలు ఎలా చల్లారుస్తారన్నది ఇప్పుడు కీలకం. ఒకవైపు “కూటమి ఐక్యతను” కాపాడుకోవాల్సిన బాధ్యత.. మరోవైపు “పార్టీ శ్రేణుల అసంతృప్తిని” తగ్గించాల్సిన అవసరం అధిష్ఠానంపై ఉంది.
రాజీనామాల “ప్రకటన ఒత్తిడి” వ్యూహంగా మారుతుందా?
చర్చలతో వివాదం సద్దుమణుగుతుందా..?
చివరకు మేయర్ పీఠం విషయంలో స్థానిక నేతలు కూటమి నిర్ణయానికి అంగీకరిస్తారా?
చల్లా – చల్లారుతారా..?
“వాట్ నెక్స్ట్” అన్న ప్రశ్నలు ఏలూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రానున్న పరిణామాలే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరదించనున్నాయి.
✍️✍️ ది డెస్క్ ఎడిటర్ – విశ్వనాథ్

