The Desk …Aadoni : నేను ఇచ్చిన నగదు ఇప్పించండి

The Desk …Aadoni : నేను ఇచ్చిన నగదు ఇప్పించండి

🔴 కర్నూలు జిల్లా : ఆదోని : ది డెస్క్ :

నా కుమారుడికి ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి

రాష్ట్ర డీజీపీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని ఇప్పించడంతో పాటు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివనం గ్రామానికి చెందిన వరలక్ష్మి రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు విడివిడిగా ఫిర్యాదు చేశారు.

బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆదోని మండలానికి చెందిన తన భర్త అయినా శ్రీ వినాయక రైస్ మిల్ యజమాని హరిచంద్రరెడ్డి వద్ద నుంచి కె. శాంతాన్ కుమార్ 2009లో రూ.1.50 కోట్లను అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరిన సమయంలో, 2018లో హైదరాబాద్‌లో తాను ఏర్పాటు చేయబోయే కేంబ్రిడ్జ్ స్కూల్ కొత్త బ్రాంచ్‌లో భాగస్వామ్యం కల్పిస్తానని, ఇందుకోసం రూ.5 కోట్లు సమకూర్చాలని శాంతాన్ కుమార్ కోరినట్లు ఆమె ఆరోపించారు.

పాత అప్పుకు వడ్డీ కలుపుకొని అదనముగా మరో రూ.3 కోట్లను తీసుకున్నారని, మొత్తం రూ.5 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న పాఠశాలలో భాగస్వామ్యం కల్పిస్తామని నమ్మించినట్లు వరలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

2019 నుంచి 2021 వరకు కరోనా పరిస్థితులను కారణంగా చూపుతూ డబ్బుల చెల్లింపును వాయిదా వేసినట్లు తెలిపారు. 2022లో తన భర్త హరిచంద్రరెడ్డి మరణించిన అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడటంతో, శాంతాన్ కుమార్ వద్ద ఉన్న రూ.5 కోట్లను తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందన సరిగా లేదని ఆమె ఆరోపించారు.
తాను బంధువులతో కలిసి హైదరాబాద్ వెళ్లి డబ్బుల విషయం అడగగా, నష్టాల్లో ఉన్నానని, తరువాత చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే నెల రోజుల అనంతరం తమపై కోర్టులో కేసు వేసినట్లు వరలక్ష్మి పేర్కొన్నారు.
అంతేకాకుండా డబ్బుల విషయం ఇకపై అడగవద్దని, అడిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, తన కుమారుడిని చంపుతానని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ విషయంపై ఇప్పటికే ఆదోని పోలీసు అధికారులతో పాటు జిల్లా ఎస్పీ, ఐజీకి ఫిర్యాదు చేసినట్లు వరలక్ష్మి తెలిపారు. అయితే సంబంధిత వ్యక్తి స్వయంగా హాజరుకాకుండా తన న్యాయవాదుల ద్వారా కేసు హైదరాబాద్ కోర్టు పరిధిలో ఉందని, అనారోగ్య కారణాలతో రావడం సాధ్యం కాదని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.

తన కుటుంబానికి ఎదురవుతున్న బెదిరింపుల నేపథ్యంలో తక్షణమే స్పందించి, తనకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయం చేయడంతో పాటు, తన కుమారుడికి, తన కుటుంబానికి తగిన పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను వరలక్ష్మి కోరారు. ఒక మహిళగా తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, తన కుమారుడి ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.