యువత క్రీడల్లో ప్రతిభ కనబర్చేలా శిక్షణ పొందాలి➖జిల్లా కలెక్టర్ నాగరాణి
🔴 పగో: తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పట్టణంలో రూ.2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌ను ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. యువత కోసం ఈత పోటీలను కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ :.
పి4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణానికి గర్వకారణమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో, ఆర్వో ఫిల్ట్రేషన్ సిస్టమ్, శుభ్రత నిర్వహణ విధానాలతో నిర్మించబడిన ఈ సదుపాయం యువతకు అత్యుత్తమ శిక్షణ అందించేలా రూపొందించబడిందన్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుందని, యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు. ఇలాంటి ఆధునిక సదుపాయం సమీప ప్రాంతాల్లో లేకపోవడం వల్ల ఇది ప్రత్యేకమైనదని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. ఇతర పట్టణాలకు వెళ్లి శిక్షణ పొందాల్సిన అవసరం లేకుండా స్వస్థలంలోనే అవకాశాలు లభిస్తున్నాయని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు.
శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ :.
స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా యంత్రాంగం, స్థానిక నాయకుల సహకారంతో నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రభుత్వం క్రీడారంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, యువత అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని సూచించారు. గతంలో నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తి కావడం ఆనందదాయకమని తెలిపారు. ప్రజలు ఇకపై ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా సురక్షితంగా ఈత కొట్టే అవకాశం కలిగిందన్నారు.
శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు మాట్లాడుతూ :
ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత వాటిలో చురుకుగా పాల్గొనాలని కోరారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, మండల రెవెన్యూ అధికారి టి.రాజరాజేశ్వరి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, బీజేపీ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

