కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను మర్యాదపూర్వకంగా కలసి, ప్రజలకు అత్యంత అవసరమైన రైల్వే సదుపాయాలపై చర్చించడం జరిగింది.
.
ఈ సందర్భంగా కోవిడ్-19 సమయంలో నిలిపివేయబడిన మచిలీపట్నం – తిరుపతి రైలు సేవలను ఇప్పటికీ పునరుద్ధరించకపోవడం వల్ల మచిలీపట్నం, పరిసర ప్రాంతాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా మచిలీపట్నం నుండి తిరుపతికు డైరెక్ట్ గా ప్రయాణించేందుకు ప్రత్యక్ష రైలు లేకపోవడం వల్ల అనేక మార్గాల్లో మార్పిడి ప్రయాణం చేయాల్సి వస్తోందని, మచిలీపట్నం నుండి గుడివాడకు వెళ్లి అక్కడ ప్లాట్ఫారం మారడానికి వృద్ధులకు, స్త్రీలకు చిన్న పిల్లలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. అందువల్ల, తిరుపతి–మచిలీపట్నం రైలు సేవలను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ని కోరారు.
అదేవిధంగా, కృష్ణా జిల్లా పరిధిలోని చిలకలపూడి, రామవరప్పాడు, వెంట్రప్రగడ మరియు మోటూరు రైల్వే స్టేషన్లలో కొన్ని ముఖ్యమైన రైళ్లకు నిలుపుదల కల్పించాలనే అంశాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ స్టేషన్లలో రైలు నిలుపుదల కల్పిస్తే స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ వినతులను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు బాలశౌరి తెలిపారు. ప్రజల అవసరాల మేరకు రైల్వే సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారని తెలిపారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతం లో ప్రతిపాదించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలలో (ROB)
గుడివాడ – కవుతరం, నిడమానూరు యార్డ్, నిడమానూరు – ఉప్పులూరు, ఉప్పులూరు యార్డ్, పెడన – మచిలీపట్నం, పొట్టిపాడు, వేలేరు, పురుషోత్తమపట్నం, పెద అవుటపల్లి, వీరవల్లి వద్ద మంజూరు కావడం పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలియచేసారు.

