🔴 నెల్లూరు జిల్లా : :సంగం మండలం : అన్నారెడ్డిపాలెం : ది డెస్క్ :
ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటున్నాం
రైతుల ఆస్తులకు పూర్తి భరోసా కల్పిస్తున్నాం
అన్నదాతలకు ఏడాదికి రూ.20వేలు చెప్పినట్టే ఇచ్చాం:
24 నుంచి 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాం
విజయవంతంగా సూపర్ సిక్స్ హామీలు అమలుచేసాం
➖మంత్రి ఆనం

తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు, రైతన్నా మీకోసం కార్యక్రమాల్లో మంత్రి ఆనం పాల్గొని, రైతులకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ పాస్ పుస్తకాల ద్వారా భూమి యజమానుల పూర్తి వివరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, రైతుల భూ హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. గతంలో వలె ముఖ్యమంత్రి ఫొటోలు కాకుండా ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం ఇచ్చిన పాసుపుస్తకానికి తమ ప్రభుత్వం రాజముద్రతో పాటు లబ్ధిదారుని ఫొటో, క్యూఆర్ కోడ్, సెక్యూరిటీ లైన్ వంటి భద్రతాపరమైన అంశాలతో ముద్రించిన పాసుపుస్తకానికి వున్న తేడాను మంత్రి రైతులకు అర్థమయ్యేలా వివరించారు. తమ ప్రభుత్వం ఇస్తున్న పాసుపుస్తకాలు రిజర్వు బ్యాంకు ముద్రించిన కరెన్సీ నోట్ల వలె చట్టభద్రత కలిగినవన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు. రైతులకు చెప్పినవిధంగా ఏడాదికి రూ.20వేలు అందించామని మంత్రి ఆనం చెప్పారు. జిల్లాలో 404 రైతుసేవా కేంద్రాల పరిధిలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 4150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ప్రభుత్వానికి విక్రయించగా, 24 నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాలకు రికార్డుస్థాయిలో జమ చేశామన్నారు. ఇది రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచే ప్రభుత్వమని పునరుద్ఘాటించారు.
తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతినెలా కోట్లాది రూపాయల పింఛన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం అందిస్తుందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ప్రభుత్వమే నిధులు భరిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా గ్రామస్థాయిలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
సంక్షేమంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి :
అన్నారెడ్డిపాలెం గ్రామంలో రూ.168 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. పండుగ వాతావరణంలో కోట్లాది రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామంలో రూ.36 లక్షలతో గ్రామ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.69 లక్షలతో తాగునీటి పథకం పనులకు ప్రారంభం పలికారు. పల్లిపాలెంకు రూ.31 లక్షలతో అంతర్గత పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే పల్లిపాలెం వినాయక స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షలతో భూమిపూజ నిర్వహించారు. రూ.8.5 లక్షలతో నిర్మించిన కల్వర్ట్‌ను ప్రారంభించారు. గ్రామ సచివాలయం వద్ద రూ.9 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించగా, అరుంధతివాడలో మరో రూ.9 లక్షల సీసీ రోడ్డుకు కూడా ప్రారంభోత్సవం చేశారు. అలాగే గ్రామస్థుల కోరిక మేరకు మెయిన్ బ్రిడ్జి నిర్మాణం, రోడ్ల నిర్మాణం ఇతర అభివద్ధి పనులకు మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా శోభాయమానంగా ఉగాది వేడుకలు :
ఈనెల 19 తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని ఆలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. ప్రతి ఆలయం కూడా భక్తులతో కళకళలాడేలా ఆధ్యాత్మిక శోభతో తెలుగు సంవత్సరాదిని ఆహ్వానించేలా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని, శ్రీవాణి ట్రస్టు నిధులతో 5వేలకు పైగా ఆలయాలను రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. భక్తులందరూ ఆధ్యాత్మిక భావనతో భగవత్ సాన్నిధ్యంలో ఆనందంగా గడిపేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఆత్మకూరు ఆర్డీవో పావని, ఎడిఎ అనిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి :
పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
మంగళవారం సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో 12మంది లబ్ధిదారులకు రూ. 4.91 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ 5 లక్షలు బీమా మొత్తాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ:
వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

