ప.గో జిల్లా : పెనుగొండ : ది డెస్క్ :
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకొని భారీ మొత్తంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామ పరిధిలోని NH‑216 రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడుసుమల్లి కోటేశ్వరరావు (30), ఒంగోలు సాంబశివ నగర్‌కు చెందిన వ్యక్తి నడుపుతున్న AP 39 V 4377 నంబరు గల అశోక్ లేలాండ్ 14 చక్రాల లారీలో గుండుగోలను నుంచి కాకినాడకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
దీంతో మండల సీఎస్ఆర్ఐ కె. సత్యనారాయణ, పెనుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. గంగాధరరావు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శనివారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు 50 కేజీల చొప్పున 670 బస్తాలు (మొత్తం 33.28 టన్నులు / 33,280 కిలోలు) పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ బియ్యం అంచనా విలువ సుమారు రూ.7,32,160గా అధికారులు తెలిపారు. వెంటనే లారీతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై Essential Commodities Act 1955 సెక్షన్ 7(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

