కైకలూరులో ముమ్మర వాహన తనిఖీలు – డ్రైవర్లకు భారీ జరిమానాలు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

రహదారి ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు పట్టణంలో శుక్రవారం ఉదయం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.
కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకట కుమార్, పోలీసు సిబ్బంది ‘విజిబుల్ పోలీసింగ్’లో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా బొలెరో వంటి గూడ్స్/లోడింగ్ వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా అటువంటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని దింపేసి రోడ్డు భద్రతపై కౌన్సిలింగ్ ఇచ్చారు.
నిబంధనలు అతిక్రమించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బొలెరో వాహన డ్రైవర్లపై మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుని భారీగా జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా కైకలూరు పట్టణ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ..
గూడ్స్ వాహనాలు కేవలం సరుకుల రవాణాకు మాత్రమే ఉపయోగించాలని, వాటిలో మనుషుల ప్రయాణం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అతిగా ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయక ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై, డ్రైవర్లపై లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ స్పష్టం చేశారు.

