ఏలూరులో ప్రత్యేక డ్రైవ్ – 55 మందికి హెల్మెట్లు కొనుగోలు చేయించిన పోలీసులు
ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ : ది డెస్క్ :
వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించాలని.. లేకుంటే అట్టి వారి పై చర్యలు తీసుకుంటామని…ప్రాణాలు కాపాడుకోవదానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ఏలూరు పోలీసులు సూచించారు. రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఏలూరులోని ఆశ్రమ హాస్పిటల్ సెంటర్ వద్ద బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఏలూరు రూరల్ ఎస్ఐ నాగబాబు సిబ్బందితో కలిసి చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌కు సత్యనారాయణ ఆధ్వర్యం వహించగా, ఎఎంవిఐ సురేష్ బాబు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించకుండా, 55 మందితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగబాబు మాట్లాడుతూ…
రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అధిక శాతం యువతేనని, ముఖ్యంగా మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అతి వేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణాలని, థ్రిల్ కోసం వేగంగా వాహనాలు నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలూ ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు.
ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకమవుతుందని, నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఆవేదనను వివరించి వాహనదారుల్లో బాధ్యత పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని, అలా చేస్తే తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాంతకమని పేర్కొంటూ, ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసుల చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

