🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, అభివృద్ధికి ప్రాధాన్యం.
దేశవ్యాప్తంగా 273 ప్రాజెక్టులకు అనుమతి.
ఏపీలో 5 ప్రాజెక్టులు చేపట్టిన NMET
ఏపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఏలూరు ఎంపీ.
నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (NMET) కింద ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా, అనేక గనుల అన్వేషణ మరియు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. దేశ అభివృద్ధికి కీలకమైన వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, అభివృద్ధి (NMET) పనులపై వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం..
వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా మొత్తం 289 ప్రాజెక్టులు చేపట్టగా వీటిలో 273 ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతివ్వగా, మరో 16 ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 1729.35 కోట్ల నిధులు కేటాయించగా 922.83 కోట్ల నిధులు ఇప్పటికే విడుదల చేశారు.
ఏపీకి సంబంధించిన 5 ప్రాజెక్టులకు అనుమతివ్వగా, మరొక ప్రాజెక్టు ప్రతిపాదన దశలో ఉన్నదని తెలిపారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ సంస్థలతోపాటు మూడు ప్రైవేటు సంస్థలకు కూడా అనుమతి ఇచ్చినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో మంత్రి తెలిపారు. వీటిలో జియో మెరైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిటికల్ మినరల్ ట్రాకర్, మైనింగ్ టెక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఉన్నాయి.
నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (NMET) కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులలో 43 ప్రాజెక్టులతో గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 32 ప్రాజెక్టులతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఏపీలో అనుమతించిన ప్రాజెక్టులకు 66.67 కోట్లు కేటాయించగా 30.15 కోట్లు ఇప్పటికే విడుదల చేశారని, ఆయా ప్రాజెక్టులు కార్యాచరణలో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్‌లకు ప్రోత్సాహం :
ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) పథకంలో భాగంగా వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లను స్థాపించడానికి పెట్టుబడిదారులకు గ్రాంట్-ఇన్-ఎయిడ్/సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలలో ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఆమోదించినట్లు తెలిపిన కేంద్ర మంత్రి అందులో ఒకటి ఏలూరు జిల్లాకు, మరొకటి విజయనగరం జిల్లాలోనూ మంజూరు చేశామని చెప్పారు.
25.85 కోట్ల వ్యయంతో ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయే క్లస్టర్ (రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్కు -నూజివీడు మండలం మొర్సపూడి)కు ఇటీవలే శంకుస్థాపన కూడా జరిగిన విషయం తెలిసిందే. 2017 నుండి దేశంలో క్లస్టర్ విధానం ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రమికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ..
వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాల సృష్టి (APC) కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆమోదించబడిన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.

