🔴 అమరావతి : ది డెస్క్ :
భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదు.
దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ఆలయలలో ఉత్సవాలు ఇతర కృతువులను, వైదిక ఆగమాలు వైదిక పరమైన అంశాల్లో అధికారుల జోక్యం ఉండకూడదు
➖మంత్రి ఆనం
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం సహా వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ వంటి ప్రధాన ఆలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రి ఆనం సమగ్రంగా రివ్యూ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సలహాలు, సూచనలు చేశారు.
మహా శివరాత్రి నాటికి అన్ని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్లు పూర్తి సమన్వయంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు, వసతులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి సదుపాయాలు సకాలంలో లభించేలా కార్యచరణ అమలు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయాలకు వచ్చే భక్తులను అగౌరవపరిచేలా లేదా ఇబ్బందులకు గురిచేసేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
రోజురోజుకూ ఆలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, మహా శివరాత్రి వంటి కీలక సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో దేవాదాయ శాఖ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భక్తులకు గౌరవ మర్యాదల విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట విషయంలో రాజిపడే ప్రసక్తి లేదని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
అలాగే ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని, పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన SOPలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆనం మరికొన్ని కీలక సూచనలు చేస్తూ, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ నియంత్రణకు స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని, ప్రసాదం పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా సక్రమంగా జరగాలని ఆదేశించారు.
పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టి ఆలయాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహా శివరాత్రి ఏర్పాట్లలో టెంపుల్ ఆఫీసర్లు, ఫెస్టివల్ ఆఫీసర్లు VIPలతో పాటు సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి కేటాయించిన సమయాల్లోనే దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం సూచించారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమీషనర్ కే.రామచంద్ర మోహన్, రిజినల్ జాయింట్ కమీషనర్లు, డిప్యూటీ కమిషనర్ లు జిల్లా మరియు దేవాదాయ శాఖ అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన శైవ క్షేత్రలలో ఉన్న కార్యనిర్వాహణాధికారులు పాల్గొన్నారు.

