The Desk … Ghantasala : సోషల్ మీడియా పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఐ వేమన చందన

The Desk … Ghantasala : సోషల్ మీడియా పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్ఐ వేమన చందన

మండలం ఫస్ట్ వచ్చిన టెన్త్ విద్యార్ధికి రూ.2 వేల నగదు బహుమతి

కృష్ణాజిల్లా : శ్రీకాకుళం (ఘంటసాల): ది డెస్క్ :

విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేమన చందన అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ చందన మాట్లాడుతూ … నేటి విద్యార్థులు, యువత సోషల్ మీడియాకు అలవాటుపడి ఆకర్షణతో చెడు స్నేహాలకులోనై అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటం, మత్తు పదార్ధాలు అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, ఇతర చట్టాల గురించి అవగాహన కల్పించారు.

ఒత్తిడి లేకుండా విద్యనభ్యసించి టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

ఫోన్ల ద్వారా జరిగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ చందన తెలిపారు. అత్యవసర సమయంలో పోలీసులకు 112, సైబర్ నేరాలకు 1930, డ్రగ్స్ నేరాలకు 1972 నెంబర్లకు కాల్ చేయాలన్నారు.

ఘంటసాల మండలంలోని టెన్త్ క్లాస్ విద్యార్థుల్లో మండలం ఫస్ట్ వచ్చిన విద్యార్థికి తన జీతం నుంచి రూ.2 వేల నగదు బహుమతి ఇస్తానని ఎస్ఐ చందన ప్రకటించారు. అనంతరం ఎస్ఐ చందనను పలువురు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు జనసేన సీనియర్ నేత కొండవీటి కృష్ణమూర్తి, కొండా బాబూరావు, జనసేన మండల కార్యదర్శి కొండవీటి శ్రీనివాసరావు, తుమ్మల రంగయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.