🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
ఆత్మకూరు మణిహారంగా నగరవనాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ఆదివారం ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని అటవీ శాఖ భూముల్లో ఏర్పాటు చేయనున్న నగరవన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. నగరవన ఏర్పాటుపై అటవీ శాఖ అధికారులతో మంత్రి చర్చించారు. నగరవన అభివృద్ధికి రూపొందించిన మ్యాప్‌లను అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ :
ఆత్మకూరు పట్టణ ప్రజలు ప్రకృతి ఒడిలో మానసిక ఆనందం పొందేలా ఆహ్లాదకర వాతావరణంలో నగరవనాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 1.40 కోట్ల నిధులను మంజూరు చేయగా, ఇప్పటికే రూ. 98 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాధాన్యత క్రమంలో మిగిలిన నిధులు కూడా విడుదల చేస్తామని తెలిపారు.
తొలి విడతలో సుమారు 100 ఎకరాల భూముల్లో అవసరమైన మేర భూమిని చదును చేసి, వాకింగ్ ట్రాక్, క్రీడా పరికరాల ఏర్పాటు, స్నేక్ పార్క్, కాఫీ పార్క్, సోలార్ లైటింగ్ వ్యవస్థ, విస్తృత ప్లాంటేషన్ వంటి ఆహ్లాదకరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. నగరవనంలో ఆయుర్వేద ఔషధ విలువలు గల మొక్కలను బ్లాకులుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఈ నగరవనం ద్వారా ఆత్మకూరు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తూ, ప్రశాంత వాతావరణంలో సేద తీరే అవకాశాన్ని కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు. ఆత్మకూరులో అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు క్రీడా మైదానాలు, నగర వనాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నగరవనానికి అందమైన ముఖద్వారం, గేట్లు, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేసి, జిల్లాలోనే అతిపెద్ద నగరవనంగా దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ మహబూబ్ బాషా, ఆర్డీవో పావని, తాసిల్దార్ పద్మజ, కమిషనర్ గంగా ప్రసాద్, అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

