కృష్ణాజిల్లా : గన్నవరం : ది డెస్క్ :
గన్నవరం నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం గన్నవరం మండల టిడిపి ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి యార్లగడ్డ కేకు కోసి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే యార్లగడ్డ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీకు గన్నవరం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం పొందిన ఏడుగురు కమిటీ సభ్యులను ఈరోజు యార్లగడ్డ సన్మానించారు.
అనంతరం గన్నవరం నియోజకవర్గం నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన 50 మంది ఉత్తమ కార్యకర్తలకు గౌరవ సూచకంగా సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు ఎదురొడ్డి నిలిచి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని కొనియాడారు. గత ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ వచ్చిన గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో టిడిపి మెజార్టీ సాధించేలా కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు.
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు పునరుద్గాటించారు. నియోజవర్గంలో నాలుగు భవనాలు కట్టి పది రోడ్లు వేస్తే అభివృద్ధి అనుకోవటం భావ్యం కాదని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అంకితభావంతో పనిచేసిన అన్ని వర్గాల నాయకులకు పార్టీ పదవుల్లో స్థానం కల్పించామని తెలిపారు.
నామినేటెడ్ పోస్టుల్లో నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు యార్లగడ్డ వివరించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రతినిత్యం కల్పిస్తూ పేదవారిని సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే వెంకట్రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన సంగతిని సందర్భంగా గుర్తు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగించేందుకు నాయకులు, కార్యకర్తలు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.
గడచిన ఏడాది కాలంలో ఎన్నో ప్రజా సమస్యల పరిష్కరించామని ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ప్రజలకు మరింత చేరువకావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు రూపొందించిన క్యాలెండర్లు డైరీలను ఎమ్మెల్యే యార్లగడ్డ ఆవిష్కరించారు.

