- ➖ జాతీయ జెండాను అంతర్జాతీయ వేదికలపై ఎగరవేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది : మంత్రి ఆనం
నెల్లూరు : ది డెస్క్ :
తెలుగు తేజం కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. ఖతార్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ FIDE వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో తెలుగు తేజం, భారత చెస్‌కు చిరునామాగా నిలిచిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు అంటూ మంత్రి ఆనం ప్రశంసించారు.
మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు మొత్తం 5 పతకాలు సాధించిన అరుదైన ఘనతను హంపి సొంతం చేసుకోవడం విశేషం మంత్రి ఆనం కొనియాడారు.
కోనేరు హంపి భారతదేశం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్ రంగంలో అడుగుపెట్టి, అనేక ప్రపంచ టోర్నమెంట్లలో పతకాలు సాధిస్తూ భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై గర్వంగా ఎగురవేశారు.
ఆమె క్రమశిక్షణ, పట్టుదల, ఆటపై ఉన్న అపారమైన నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
ప్రపంచ స్థాయిలో భారత మహిళల చెస్‌కు గుర్తింపు తీసుకొచ్చిన కోనేరు హంపి విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, యావత్ దేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా కోనేరు హంపి కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.

