- గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో 42 ఆర్ మేజర్ డిస్ట్రిబ్యూటరీకి నీటి విడుదల చేసిన మంత్రి
- మెట్ట ప్రాంత రైతుల్లో వెల్లివెరిసిన ఆనందం…అపర భగీరథుడు ఆనం అంటూ అన్నదాతల ప్రశంసలు
- ఈ కాలువ ద్వారా 10 గ్రామాల్లోని 3వేల ఎకరాలకు సాగునీరు
- 44 ఆర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి ముస్తాపురం రైతులకు కూడా నీళ్లిచ్చేందుకు కృషి చేస్తాం
- రైతులకు అన్నివిధాల చేదోడూ ఉండడమే తమ ప్రభుత్వ లక్ష్యం.
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
మెట్టప్రాంతమైన ఆత్మకూరు మండలంలోని బీడు భూముల్లో నీళ్లు పారుతుంటే రైతుల కళ్లల్లో ఆనందం చూసి మనసుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
సోమవారం ఆత్మకూరు సమీపంలోని వింజమూరు రోడ్డు వద్ద నబ్బీనగరం`రాజవోలు మార్గంలో సోమశిల ఉత్తర కాలువ నుంచి 42 ఆర్ మేజర్ కెనాల్‌కు గంగమ్మతల్లికి జలహారతి ఇచ్చి రైతులతో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు.బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు, అభివృద్ధి ప్రదాత ఆనం రుణం తీర్చుకోలేనిదని రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని మంత్రితో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ:
42ఆర్ మేజర్ కెనాల్‌కు నీటిని విడుదల చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. బీడు భూముల్లో నీళ్లు పారుతుంటే అన్నదాతల కళ్లల్లో ఆనందం మనసుకు సంతృప్తినిచ్చిందన్నారు.సోమశిల ఉత్తరకాలువ రెండు జిల్లాలు, 5 నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తుందని చెప్పారు.
అనేక అటవీశాఖ భూసేకరణ అడ్డంగులను అధిగమించి 42ఆర్ కెనాల్‌ను తవ్వి నబ్బీనగరం..రాజవోలు నుంచి దిగువ గ్రామాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ కెనాల్ నుండి 6 ఉప కాలువల ద్వారా సాగునీరు ప్రవహించడంతో ఆత్మకూరు మండలం 10 గ్రామాల్లోని సుమారు 3వేల ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని మంత్రి చెప్పారు.
ఈ 42 ఆర్ కెనాల్ కాలువ పొడవు 8.60 కిలోమీటర్లు కాగా కాలువ కెపాసిటీ 43 క్యూసెక్కులుగా మంత్రి వివరించారు. ఆత్మకూరు మండలంలోని బోయిల చిరువెళ్ల, గొల్లపల్లి, నారంపేట, నాగులపాడు, చెర్లోయడవల్లి, రావులకొల్లు, నెల్లూరుపాలెం, ఆత్మకూరు, పేరారెడ్డిపల్లి, అల్లీపురం గ్రామాల్లోని పంటపొలాలకు ఈ జలాలు ప్రవహిస్తాయని చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు వరకు కూడా సోమశిల ఉత్తరకాలువ ప్రవహిస్తుందన్నారు.
ఉత్తరకాలువను మరింత అభివృద్ధి చేసి త్వరలోనే 44ఆర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి ముస్తాపురం రైతులకు కూడా నీటి అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఆనం చెప్పారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా సాగునీటి వ్యవస్థలను పునరుద్ధరించి సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీహరినాయుడు, సోమశిల ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ్‌చౌదరి, ఎంపిపి కేతా వేణుగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు ఆర్‌డివో పావని, తహశీల్దార్ పద్మజ, ఇరిగేషన్‌శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

