🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
వ్యవసాయ రంగంలోని వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా వ్యవసాయ రంగ బలోపేతానికి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్గటించారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణంలో “రైతన్నా…మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలుత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు, సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కమిటీ చైర్మన్ లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్ లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రస్థాయిలో డైరెక్టర్ పదవులు పొందిన వారిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ:
రైతు ప్రస్థానంలో ప్రధాన భాగస్వామ్య వ్యవస్థలైన వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సాగునీటి సంఘాలను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. గతంలో నిర్వీర్యమైన ఈ వ్యవస్థలను ప్రజాస్వామ్య బద్ధంగా ప్రక్రియను పూర్తి చేసి రైతులనే సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి రైతుకు అండగా నిలిచామన్నారు.
జిల్లాలో సోమశిల కండలేరు జలాశయాల్లో వరుణ దేవుడి దయవల్ల 150 టి ఎం సి ల వరకు నీరు సమృద్ధిగా ఉందన్నారు. రైతులు విత్తనం నాటే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు తమ ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. సోమశిల హై లెవెల్ పనులను కూడా మొదలుపెట్టి మర్రిపాడు మండలానికి నీళ్లు ఇవ్వాలన్నదే తమ లక్ష్యంగా మంత్రి చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేయమని అధికారులు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఎరువులను, విత్తనాలను ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రైతులకు అన్ని విధాలా తోడుగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప, మార్కెటింగ్ శాఖ ఏడి అనిత, వ్యవసాయ శాఖ ఏడి నర్సోజిరావు, ఆర్డీవో పావని, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

