The Desk…Amaravati : గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమీక్ష

The Desk…Amaravati : గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమీక్ష

  • దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

🔴 అమరావతి : ది డెస్క్ :

రాబోయే గోదావరి పుష్కరాలు–2027 ను పురస్కరించుకొని, నేడు రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో జరుగనున్న పుష్కర సన్నాహక పనులు, ఆలయాల అభివృద్ధి, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ:

పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి పుష్కర ఘాట్లకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు చేరుకుంటారని వారిని దృష్టిలో ఉంచుకొని, ప్రతి ఘాట్‌లో భద్రత–సౌకర్యాల బలోపేతం, శానిటేషన్ చర్యలు, మహిళలకు ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌లు, త్రాగునీటి సదుపాయాలు, వైద్యశిబిరాలు, అగ్నిమాపక, పోలీసు, SDRF వంటి అత్యవసర సేవల విభాగాలతో సమన్వయం అత్యంత కీలకమని మంత్రి ఆనం పేర్కొన్నారు.

అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి తీరం వద్ద ప్రత్యేక ఆధ్యాత్మిక–సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక హరతులు,ఘాట్‌ల వద్ద శాశ్వత–తాత్కాలిక సదుపాయాల విస్తరణ,యాత్రికుల రద్దీ నియంత్రణకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, టూరిజం శాఖతో కలిసి ప్రత్యేక దర్శన–యాత్ర ప్యాకేజీలు,పుష్కరాలపై రాష్ట్రవ్యాప్తంగా పబ్లిసిటీ, అవగాహన కార్యక్రమాలు, తక్షణమే ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని మంత్రి ఆనం ఆదేశించారు. ముఖ్యంగా “పుష్కరాలు అంటే భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనం. రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన ఈ మహోత్సవాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని సూచించారు.

సమావేశానికి దేవాదాయ శాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ కే. రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజనీర్ శేఖర్, స్థపతి బి. పరమేశ్వరప్ప సహా దేవాదాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.