The Desk…Eluru : ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచి రైతులను ఆదుకోండి – కేంద్రానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి

The Desk…Eluru : ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచి రైతులను ఆదుకోండి – కేంద్రానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి

  • కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసిన ఏలూరు ఎంపీ.
  • ఆయిల్ పామ్ రైతులను ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి.
  • ‎క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గించటం వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ లేఖ.
  • డైనమిక్ దిగుమతి సుంకం విధానంపై సూచనలు.

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

సాగు ఖర్చుల కంటే మార్కెట్లో లభిస్తున్న ధరలు తగ్గిపోయి ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితుల పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ను కలిసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇటీవల ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని 10 శాతం తగ్గించటం వల్ల దేశీయంగా ధరలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, దిగుమతి సుంకాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను పేర్కొంటూ ఒక లేఖను వాణిజ్య కార్యదర్శికి అందించారు. భారతదేశ పామాయిల్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 60 శాతంగా ఉందన్న ఎంపీ, ధరలు తగ్గి నష్టాలపాలవుతున్న రైతులను ఆదుకోవాలని తన లేఖలో కోరారు.

ముడి పామాయిల్ పై (CPO) పై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించటం వల్ల ధర మెట్రిక్ టన్నుకు రూ. 1,29,000 నుంచి 1,00,000 కు తగ్గింది. దీని కారణంగా తాజా ఆయిల్ పామ్ గెలల (FFB) ధర టన్నుకు రూ. 21,000 నుంచి 17,800 కు తగ్గిపోయిన పరిస్థితిని ఎంపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.

ఆయిల్ పామ్ సాగు ఖర్చు టన్నుకు 22,000 వరకూ అవుతుండగా మార్కెట్ ధర 17,800కు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలు పాలవుతున్నారన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, అధిక ఇన్ పుట్ ఖర్చులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, మరియు పెరుగుతున్న తెగుళ్లు కారణంగా ఇప్పటికే అధిక భారాన్ని ఎదుర్కొంటున్న రైతులకు ధరలు తగ్గిపోవటం ఆయిల్ పామ్ సాగుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‎గత 30 సంవత్సరాల్లో ప్రభుత్వ ధరల విధానాల కారణంగా దాదాపు 1.2 లక్షల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ తోటలు సాగు తగ్గిపోయిందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఈ పరిస్థితినుంచి బయటపడి, రైతులను ఆదుకునేందుకు రెండు ప్రధాన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. మొదటగా, ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పునరుద్ధరించవలసిందిగా కోరారు.  2022వ సంవత్సరంలో ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం 49 శాతం గా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. 

రెండవది, ఆయిల్ పామ్ సాగు ఖర్చులను కవర్ చేస్తూ స్థిరమైన ధరలను పొందేగలిగేలా ముడి పామాయిల్ ధర మెట్రిక్ టన్నుకు 1,30,000 కంటే తగ్గకుండా ఉండేలా డైనమిక్ దిగుమతి సుంకం విధానాన్ని రూపొందించాల్సిందిగా ఎంపీ కోరారు. ఈ రెండు విషయాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకుంటేనే నష్టాన్ని నివారించి, రైతుల విశ్వాసాన్ని పునరుద్ధరించటానికి సాధ్యమవుతుందని తన లేఖలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.

ఎంపీ లేఖలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించిన వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆయిల్ పామ్ రైతులకు న్యాయం జరిగేట్లు చూస్తానని హామీ ఇచ్చారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. కాగా, తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతూ ఢిల్లీ స్థాయిలో పట్టువదలకుండా తమ కోసం కృషి చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఏలూరు జిల్లా పామాయిల్ రైతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.