The Desk…Eluru : ‎అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంతో రైతుల కుటుంబాల్లో సంతోషం : ఎంపీ మహేష్

The Desk…Eluru : ‎అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంతో రైతుల కుటుంబాల్లో సంతోషం : ఎంపీ మహేష్

  • ‎రైతు సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం.
  • ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు 20,000
  • ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు
  • ‎‎”రైతన్నా..మీకోసం” కార్యక్రమం సందర్భంగా ఎంపీ ప్రకటన.
  • ‎రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ➖MP (మహేష్ పుట్టా)

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్:

రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అన్నదాతల్లో అవగాహన కోసం “రైతన్నా.. మీకోసం” పేరుతో సోమవారం నుంచి డిసెంబర్ 2 వరకూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఏలూరు ఎంపీ.. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనే లక్ష్యంతో పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అన్ని ప్రాజెక్టులకు సకాలంలో నీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. చిన్న, పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ వేగంగా చేపట్టడంతోపాటు, డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యాన్ని  ప్రోత్సహిస్తున్నామని, బిందు సేద్యంపై 100% రాయితీ పథకాన్ని పునరుద్ధరించామని, తాజాగా రైతన్నల కోసం కిసాన్ డ్రోన్ సేవలు కూడా తీసుకొచ్చామని ఎంపీ చెప్పారు. 

రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్రంలోని 46,86,838 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 14 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.

ఇది దేశంలోనే రికార్డు అని, మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి సహాయం రైతులకు అందించిన ప్రభుత్వం లేదన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. వరి, పెసర, మినుము వంటి పంటలతో పాటు తొలిసారిగా పొగాకును కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ఏలూరు జిల్లాలో పొగాకు రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకు కొనుగోలుకు తాను కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పొగాకు రైతులకు దాదాపు 150 కోట్ల లబ్ది చేకూరిన విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు గతంలో హెక్టారుకు 17 వేల రూపాయలు మాత్రమే ఇస్తుండగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 8000 పెంచి మొత్తం 25000 ఇస్తున్నామని చెప్పారు.

రైతులకు అదనపు ఆదాయంగా ఉంటున్న పశుసంవర్ధక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ పాలు, మాంసం ఉత్పత్తి పెంపుదలకు చర్యలు చేపట్టామని, మెరుగైన పౌల్ట్రీ పాలసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లోనే సూపర్ సిక్స్ సహా హామీలన్నీ  అమలు చేసి రికార్డు సృష్టించమన్నారు.

ఈ ఏడాది ఖరీఫ్ లో  7.92 లక్షల మంది రైతులకు 141.25 కోట్ల రాయితీతో 4.22  లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసామని, రబీలో 11. 77 కోట్లతో 57,500 క్వింటాళ్ల విత్తనాలు ఇచ్చామని ఎంపీ చెప్పారు. ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.1.50 తో విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.

‎వీటితోపాటు రాష్ట్రంలో ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా 13 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా ఇటీవల జరిగిన విశాఖ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు, మామిడి, కోకో, పామాయిల్, కొబ్బరి, నిమ్మ, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయటం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

వీటి వలన రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకునే వెసులుబాటు లభించడంతో పాటు గిట్టుబాటు ధర పొందడానికి వీలుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ విధంగా రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లాలో రైతులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించే “రైతన్నా.. మీకోసం” కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను, రైతు సంఘాల నేతలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్  కోరారు.