గుంటూరు జిల్లా : మంగళగిరి : ది డెస్క్ :
వాట్సాప్, ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను హ్యాక్ చేసి మోసగించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల. వెంకట్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల పలువురు బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదుల ప్రకారం.. హ్యాకర్లు ఖాతాదారుల ప్రొఫైల్‌లను దొంగిలించి, “అత్యవసర పరిస్థితి… నేను ఇబ్బందుల్లో ఉన్నాను… వెంటనే నగదు పంపండి” అంటూ మెసేజ్‌లు పంపుతున్నట్టు తెలిపారు. తెలిసిన వ్యక్తుల పేరుతో వచ్చిన సందేశాలు నిజమేనని భావించి నిర్థారణ చేసుకోకుండానే డబ్బులు పంపిస్తున్నారని తెలిపారు.
దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇక కొందరు హ్యాకర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బాధితుల నుండి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ తరహా మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎవరి పేరుతో డబ్బులు అడిగినా, సోషల్ మీడియా సందేశాలను నమ్మి వెంటనే డబ్బులు పంపకూడదని సూచించారు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలని, అపరిచిత లింకులు ఓపెన్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ సూచించారు.

