- ఫలిస్తున్న ఎంపీ కృషి.. తరలి వస్తున్న పరిశ్రమలు
- పట్టుబట్టి సాధిస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
- రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
- బహుళ ప్రయోజనంగా ఫుడ్, ఎంఎస్ఎంఈ పార్కులు
ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం, మంత్రుల చేతుల మీదుగా రెండు పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. రైతులకు మేలు చేయడంతో పాటు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నామన్నారు.
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోరుతూ గత ఏడాది నవంబర్ లో తాను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిత ప్రవీణ్ ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ లో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ- పీ4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గుర్తు చేశారు...
తాజాగా మంగళవారం నాడు చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 65 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయటం సంతోషం కలిగించిందన్నారు. అదే సమయంలో నూజివీడు మండలం మొర్సపూడి గ్రామం వద్ద రమణ్ సింగ్ మెగా ఫుడ్ పార్కుకు మంత్రి కొలుసు పార్ధ సారధి, ద్వారకాతిరుమల మండలం సిహెచ్. పోతేపల్లిలో గోద్రెజ్ ఆగ్రో వెట్ పామాయిల్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టుకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేయడం జిల్లా రైతాంగానికి, యువతకు సంతోషకరమైన సందర్భంగా పేర్కొన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్...
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ గణనీయంగా పెరగడమే కాకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవటానికి దోహదం చేస్తుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు వలన జిల్లా రైతాంగానికి మేలు చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు, మామిడి, కోకో, పామాయిల్, కొబ్బరి, నిమ్మ, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తుండటం వల్ల ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయటం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. వీటి వలన రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకునే వెసులుబాటు లభించడంతో పాటు గిట్టుబాటు ధర పొందడానికి వీలుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుందని, తద్వారా గ్రామీణ ప్రాంత యువత వలస వెళ్ళడాన్ని తగ్గిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు...జిల్లాకు అన్ని రకాల పరిశ్రమలు తీసుకురావడంతోపాటు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చడానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు ఎంపీ. నేవీ డిపో కల కూడా త్వరలోనే సాకారమవుతుందన్నారు.
ఈ సందర్భంగా తన విజ్ఞప్తులు మన్నించి జిల్లాకు పరిశ్రమలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, ప్రత్యేకంగా మొర్సపూడి మెగా ఫుడ్ పార్కు రావడానికి కారణమైన యువ నేత నారా లోకేష్ కు, పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన తరపున, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

