The Desk…Kaikaluru : కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారాలు.. ఎమ్మెల్యే కామినేని పై అసత్య కథనాలు సరికావు

The Desk…Kaikaluru : కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారాలు.. ఎమ్మెల్యే కామినేని పై అసత్య కథనాలు సరికావు

కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి బాబి

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :

కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని..కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పై అసత్య కథనాలు సరికావని కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబి) మీడియా ముఖంగా ఖండించారు. మంగళవారం కైకలూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా గల జనసేన పార్టీ కార్యాలయం నందు ఓ పత్రికలో స్థానిక శాసనసభ్యుడు కామినేని పై వచ్చిన కథనాన్ని జనసేన నేత కొల్లి బాబి తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ.. కొల్లేరుపై సుప్రీంకోర్టులో మృత్యుంజరావు అనే వ్యక్తి పిటీషన్ వేయడం జరిగిందని, ఈ తరుణంలో వైసిపి వాళ్లు ఎమ్మెల్యే కామినేని పై బురద జల్లేందుకు ఓ పత్రికలో “కొల్లేరుపై కామినేని గారడీ” అని ప్రచురించడం హేయమైన చర్యన్నారు.

2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా అసెంబ్లీలో కొల్లేరును ప్లస్ 5 నుండి ప్లస్ 3 కి కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించగా అప్పటి కేంద్ర మంత్రులను ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని కొల్లేరుకు తీసుకువచ్చారన్నారు. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం కొల్లేరు సమస్యను అసలు పట్టించుకోలేదన్నారు. కైకలూరు నియోజకవర్గ ప్రజలు కోరితేనే కామినేని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు.

రామ రాజ్యంలో వైసిపి ఆటలు సాగవని..కొల్లేరు వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 90 శాతం పూర్తి చేసిన ఘనత మాజీ మంత్రి, ఎమ్మేల్యే కామినేని శ్రీనివాస్దే అని బాబి వివరించారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని.. వైసిపి అధికారం చేపట్టగానే మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) కక్షపూరితంగా కొల్లేరు ప్రజల పై అక్రమ కేసులు, చిత్రహింసలు గురిచేశారన్నారు.

త్వరలోనే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేల సహకారంతో కొల్లేరు సమస్యకు చెక్ పెట్టి శాశ్వత పరిష్కారం చేస్తారని తెలిపారు. సమావేశంలో జనసేన నాయకురాలు తోట లక్ష్మి, తులసి పూర్ణ, ముత్యాల తరుణ్ సాయి, పుప్పాల సూర్య ప్రకాష్ రావు లు పాల్గొన్నారు.