The Desk … Eluru : విధేయులకే డిప్యూటీ మేయర్‌ పీఠం

The Desk … Eluru : విధేయులకే డిప్యూటీ మేయర్‌ పీఠం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

కష్టకాలంలో అండగా నిలిచిన వారికే ప్రాధాన్యం

టీడీపీలోకి ముగ్గురు కార్పొరేటర్లు రీఎంట్రీ

పార్టీకి అండగా ఉంటే పదవులూ దక్కుతాయి

➖ఎమ్మెల్యే చంటి

పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వారికే డిప్యూటీ మేయర్‌ పదవి కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ నెల 23న నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో శనివారం పవర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో కూటమి నూతన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ సానుభూతిపరులు కప్పా ఉమామహేశ్వరరావు, చలువాది రూపకళాశ్రీ, నిడిగట్టు లావణ్యలను తిరిగి టీడీపీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన రాజా స్వర్ణకుమారికి ప్రకటించిన మేరకు రూ.10 లక్షల విలువైన వెండి కానుకను అందజేశారు. పురుష కార్పొరేటర్లకు నూతన వస్త్రాలు, మహిళా కార్పొరేటర్లకు చీరలు బహూకరించారు.

సీట్లు దక్కని వారికి నామినేటెడ్‌ పదవుల కోసం కృషి చేస్తామని, ఎన్నికల్లో ఓడిన వారికి సైతం అండగా ఉంటామని చంటి భరోసా ఇచ్చారు. యువ కార్పొరేటర్లు సీనియర్లను కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ మామిళ్లపల్లి పార్థసారధి, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.