🔴 అనకాపల్లి జిల్లా : అనకాపల్లి : ది డెస్క్ న్యూస్ :
ఎన్నారై భక్తుల బంగారు కానుకలు
రూ.5 లక్షల విలువైన ఆభరణాలు సమర్పణ
ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికమ్మ సేవలో భక్తులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు రూ.5 లక్షల విలువైన 48 గ్రాముల బంగారు ఆభరణాలను మంగళవారం సమర్పించారు. అమెరికాలో నివసిస్తున్న భీమరశెట్టి నాగ నంద గోపాల్, హిమబిందు దంపతులు బంగారు బొట్టును, పెంటకోట ఉదయ్ భాస్కరరావు, శుభాషిణి దంపతులు బంగారు చెవి దిద్దులను అమ్మవారికి కానుకగా అందజేశారు.
దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, ఈఓ బుద్ద మహాలక్ష్మి నగేష్ సమక్షంలో ఆభరణాలను సమర్పించగా.. ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ధర్మకర్తలు దాతలకు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి ఆహ్వానించి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు బహూకరించారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ ఆరాధ్య దైవాన్ని మరువకుండా అమ్మవారి సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

