🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
గ్రామాభివృద్ధికి కూటమి కార్యాచరణ
ప్రతి ఓటరుతో ఓటు హక్కు వినియోగింపజేయాలి
నాయకులకు దిశానిర్దేశం
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ ప్రజల మద్దతు కూడగట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నందిగామ మండలంలోని అడవిరావులపాడు, లింగాలపాడు, తక్కెళ్లపాడు, చెరువుకొమ్ముపాలెం గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశాల్లో జడ్పీటీసీ వేల్పుల అమృతమ్మ, ఎంపీటీసీలు రుద్రపోగు వెంకట్రామమ్మ, కటుకూరి ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

