🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

అభివృద్ధి పనులకు భూసేకరణలో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
అమరావతి–ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే భూసేకరణలో భూములు, ఇళ్లు నష్టపోకుండా చూడాలని జంగారెడ్డిగూడెం మండలంలోని బయ్యనగూడెం, సీతంపేట, వీరన్నగూడెం, సరిపల్లి గ్రామాల ప్రజలు కోరారు. ఈ అంశంపై జాతీయ రహదారుల అధికారులతో, కేంద్ర మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
నేవీ డిపోపై సీఎంతో చర్చ :
కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామస్థులు నేవీ ఆయుధ డిపో కోసం భూములు కోల్పోతున్న తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీ తెలిపారు. రైతులకు, గ్రామస్థులకు న్యాయమైన పరిహారం, హామీల అమలు అనంతరం ప్రజల అంగీకారంతోనే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
కూటమి ఐక్యతతో స్థానిక ఎన్నికలపై తీర్మానం :
అనంతరం జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ నేతలు పాల్గొన్న సమావేశంలో పొత్తులో భాగంగా ఎవరికి అవకాశం వచ్చినా కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

