🔴 అమరావతి : ది డెస్క్ :

తడబడని తూతిక సూచన
తక్షణమే ప్రసంశించి ఆమోదించిన చంద్రబాబు
“ఎన్టీఆర్ భరోసా” పేరు వెనుక తూతిక ఆలోచన
“NTR భరోసా” – నిరుపేదలకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛను – ఒక చారిత్రాత్మక నామకరణం వెనుక కథ
తేదీ 30.09.2014 – నేటికి సరిగ్గా పుష్కర కాలం, అంటే 12 సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రాత్మక ఘట్టం
నిరుపేదలకు అండగా నిలిచే సామాజిక భద్రతా పింఛను పథకానికి అధికారికంగా “NTR భరోసా” అని నామకరణం చేయడం వెనుక ఉన్న ఆసక్తికర ఘట్టం ఇది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో నిరుపేదలకు ఇస్తున్న సామాజిక భద్రతా పింఛనును రూ. 200/- నుండి రూ. 1000/- కు, 80% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు రూ. 1500/- కు పెంచి, పేదల జీవితాల్లో భరోసా నింపాలని సంకల్పించారు.
ఈ పెంచిన పింఛన్లను 2014 అక్టోబర్ 2 నుండి 20 వరకు నిర్వహించే “జన్మభూమి – మా ఊరు” అనే ప్రజా భాగస్వామ్య కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించారు.
విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ముఖ్యమంత్రి చేసిన మొట్టమొదటి ఐదు ప్రజా సంక్షేమ సంతకాలలో ఈ పింఛను పెంపు పథకం ఒకటి. ఈ పథకం ద్వారా నాడు రాష్ట్రంలో సుమారు 40 లక్షల మందికి లబ్ధి చేకూరగా, ప్రభుత్వంపై సుమారు రూ. 5,000 కోట్ల భారం పడింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ మహత్తర సంక్షేమ పథకానికి అధికారికంగా ఒక పేరు లేకపోవడం నాకు లోటుగా అనిపించింది.
ఈ ఆలోచనతో సరిగ్గా 12 సంవత్సరాల క్రితం, ఇదే రోజు అనగా 30.09.2014 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నా అభిప్రాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాను. “ఇంతటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి అధికారికంగా ఒక పేరు ఉంటే ప్రభుత్వ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది” అని విన్నవించాను.
ప్రజలకు, సమాజానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుందంటే ఎవరి నుంచైనా సలహాలు తీసుకునే విశాల హృదయం నారా చంద్రబాబు నాయుడు నైజం. నా సూచనను సానుకూలంగా స్వీకరించిన ముఖ్యమంత్రి, రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు మొదలు గ్రామ స్థాయి వరకు వేలాది మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో పేరును ప్రతిపాదించవలసిందిగా కోరారు.
ఆ సందర్భంలో నేను “NTR భరోసా” అనే పేరును ప్రతిపాదించాను. ‘భరోసా’ అంటే సంస్కృతంలో ధైర్యాన్ని నింపడం, ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం అని, భరోసా అనే పదమే భరోసా నుండి వచ్చిందని వివరించాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తెలుగు జాతికి చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ, పేదలకు భరోసా ఇచ్చిన ఆ మహనీయుని పేరును ఈ పథకానికి పెట్టడం సముచితంగా ఉంటుందని తెలిపాను.
నా ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించి, అందరి సమక్షంలోనే నిరుపేదల సామాజిక భద్రతా పింఛను పథకానికి ‘NTR భరోసా’ అనే పేరును సూచనప్రాయంగా ఖరారు చేశారు. అదే రోజు, అనగా 30.09.2014 న రాష్ట్ర ఉన్నతాధికారుల ఆమోదంతో ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. అదే రోజున సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈఓ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక మంచి ఆలోచనపై స్పందించి, ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి అభినందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ఉన్నతాధికారులకు, జిల్లాకు మంచి పేరు తెచ్చారని నన్ను అభినందించిన జిల్లా అధికారులకు, నాడు అభినందన సందేశాలు పంపిన శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ విషయంలో భగవంతునికి విధేయత ప్రకటించుకున్నాను.
నేడు NTR భరోసా 2.0:
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 68 లక్షల మంది నిరుపేదలకు అనేక కేటగిరీలలో ‘NTR భరోసా’ పింఛన్ పథకం ద్వారా 4000, 6000, 10000, 15000 కేటగిరి బట్టి ప్రభుత్వం నగదు సహాయం అందిస్తోంది. ఈ ఒక్క మహోన్నత సంక్షేమ కార్యక్రమానికి ఏటా సుమారు రూ. 33,000 కోట్లు ఖర్చు చేస్తోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇలా లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం అమలు కావడం లేదు.
ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రభుత్వ సంక్షేమ పథకానికి ‘NTR భరోసా’ అని నామకరణం చేసే అరుదైన అవకాశం నాకు రావడం పూర్వజన్మ సుకృతం, జన్మ ధన్యం.
నాడు 30.09.2014న ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం మండలంలో ఎంపీడీఓగా గిరిజనులకు సేవలు అందిస్తున్నాను
నాడు సీఎంతో ముఖాముఖీ మాట్లాడుతున్న దృశ్యాలు పంచుకుంటున్నాను

భవదీయులు
తూతిక శ్రీనివాస విశ్వనాథ్, MBA, LLM, మాజీ సైనికుడు, కమిషనర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, వై.ఎస్.ఆర్. కడప జిల్లా, 7675924666, 30.09.2026 (పుష్కర సంవత్సరం సందర్భంగా)

