🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :1
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రతి సమస్యకు పరిష్కార మార్గం
ఆదర్శ నియోజకవర్గంగా ఏలూరు
అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి
➖ ఎమ్మెల్యే చంటి
సమస్యల రహిత, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిపై సంబంధిత అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజల ఆరోగ్యం, ఆర్థిక భరోసాతో పాటు సొంతింటి కల సాకారం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని, పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాలలో అర్హులందరికీ పారదర్శకంగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు నిరూపించలేకపోయారు :
అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సాహసించలేదు :
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో విసిరిన బహిరంగ సవాల్‌ను వైసీపీ నేతలు స్వీకరించలేకపోయారని, తాము చేసిన ఆరోపణలను నిరూపించలేక వెనక్కి తగ్గారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీపై విచారణ కోరుతున్న వైసీపీ నేతలు ఆ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని ప్రశ్నించారు.
గతంలో గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్ నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయని, ముందుగా దానిపై విచారణ కోరాలని చంటి సూచించారు. ప్రజా సమస్యలపై కాకుండా స్వలాభం కోసం రాద్ధాంతం చేస్తే రానున్న రోజుల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదని అన్నారు. వైసీపీ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

