ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) ఆధ్వర్యంలో శుక్రవారం కైకలూరులో”చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కైకలూరు–ఏలూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆటపాక గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డీఎన్ఆర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా ఫ్లాప్ అయ్యాయని ఆరోపించారు. అక్కాచెల్లెమ్మలకు ప్రతి నెల రూ.1,500 అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించినా అమలు కాలేదన్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

