The Desk …Punganur : పొలిటికల్ గేమ్‌చేంజర్‌గా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

The Desk …Punganur : పొలిటికల్ గేమ్‌చేంజర్‌గా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

🟡 అన్నమయ్య జిల్లా : పుంగనూరు : ది డెస్క్ :

క్యాడర్‌లో ధైర్యం – ప్రత్యర్థిపై వ్యూహం

పెద్దిరెడ్డి వెనుకడుగు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

ఓటమి భయంతోనే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..❓

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థి శిబిరం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా టీడీపీ శ్రేణులు నిలబడటానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అండగా నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు పుంగనూరు రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసిందనే చర్చ సాగుతోంది.

పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి నామినేషన్ల మొదటి రోజే పోలింగ్ కేంద్రంలో టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేలా అల్లర్లు సృష్టించారు. స్వయంగా మిథున్ రెడ్డి కారులో కూర్చొని టిడిపి శ్రేణులను తొక్కించడానికి పరుగులు తీయించారు.

టిడిపి హైకమాండ్ సూచనల మేరకు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగి, టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పుంగనూరులోనే ఉండి పార్టీ శ్రేణులకు అండగా నిలిచి, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల ప్రక్రియలో ధైర్యంగా ముందుకు సాగాలని వారికి భరోసా ఇచ్చారు.

క్యాడర్ పోరాటమే కీలక మలుపు :

గతంలో ఎదురైన రాజకీయ పరిస్థితుల మాదిరిగానే ఈసారి కూడా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయని ప్రత్యర్థి వర్గం భావించి ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా నిలబడి ప్రతిఘటించడంతో రాజకీయ సమీకరణాలు మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం ద్వారా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

పెద్దిరెడ్డి నిర్ణయంపై రాజకీయ చర్చ :

పుంగనూరులో ఎన్నికల పోటీకి సంబంధించి పెద్దిరెడ్డి వర్గం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పుంగనూరుతో పాటు రాయలసీమలోని ఇతర ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయాలు సాధిస్తారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం ప్రత్యర్థి వర్గాన్ని ఆలోచనలో పడేసింది.

రాజకీయ వ్యూహంలో బీసీ జనార్దన్ రెడ్డి కీలక పాత్ర :

పార్టీ శ్రేణులకు అండగా నిలవడం, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించడం, ప్రత్యర్థి రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తల్లో ధైర్యం నింపడం వంటి అంశాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యవహరించిన తీరు టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పుంగనూరు రాజకీయాల్లో ఆయన కీలక వ్యూహకర్తగా నిలిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.