The Desk… Bhimavaram : ఏరువాక పున్నమి వేళ మావుళ్లమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక వైభవం

The Desk… Bhimavaram : ఏరువాక పున్నమి వేళ మావుళ్లమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక వైభవం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

94 మంది దంపతులతో ఘనంగా చండీ హోమం

ధాన్యలక్ష్మి – సౌభాగ్యలక్ష్మి పూజలు

రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక సంకల్పాలు

భీమవరంలోని మావుళ్లమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి సందర్భంగా ఆదివారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వ్యవసాయానికి ఊపిరి పోసే ఆషాఢ మాస ప్రారంభాన్ని సూచించే ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చండీ హోమం, ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన చండీ హోమంలో 94 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవడం, పాడిపంటలు సమృద్ధిగా పండడం, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రత్యేక సంకల్పాలతో ధాన్యలక్ష్మి పూజ నిర్వహించారు.

అదేవిధంగా మహిళల సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం సౌభాగ్యలక్ష్మి పూజలను విశేషంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి దర్శనం అనంతరం ధాన్యం, పసుపు కొమ్మును ప్రసాదంగా అందజేసి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అంజిబాబు, తీమణి సత్యవాణి, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదేశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపొలు ఏడుకొండలు తదితరులు హాజరయ్యారు.

అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మావుళ్లమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కృతజ్ఞతలు తెలిపారు.