ఏలూరు జిల్లా : ది డెస్క్ న్యూస్ :


గ్రామాభివృద్ధికి ఏకగ్రీవమే బాట
జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు పెంపు
గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే అందించే ప్రోత్సాహక మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల వరకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పెంపు 2026 గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలూ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన పంచాయతీలకే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందన్నారు. నిధులను ఆమోదించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులకే వినియోగించాలని సూచించారు. పంచాయతీ అర్హతలను అధికారులు ధ్రువీకరించిన అనంతరం, పదవీకాలంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తారని కలెక్టర్ వివరించారు.

