The Desk … Eluru : అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం ➖ఎంపీ పుట్టా మహేష్‌

The Desk … Eluru : అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం ➖ఎంపీ పుట్టా మహేష్‌

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఏలూరు నగరంలోని మాదేపల్లి, వంగాయగూడెం, బుర్రాయిగూడెంలో మొత్తం రూ.2.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని, అభివృద్ధి కొనసాగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కోకో, కొబ్బరి పరిశ్రమలతో స్థానిక యువతకు ఉపాధి

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

కోకో, కొబ్బరి ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించే అవకాశాలున్నాయని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అన్నారు. విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. కోకో, కొబ్బరి పంటల బోర్డుల ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. రైతుల కుటుంబాల యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడం కంటే స్వగ్రామాల్లో పరిశ్రమలు స్థాపించి ఇతరులకు ఉపాధి కల్పించాలని సూచించారు. పంటల బీమా, రైతులకు రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం :

రూ.1.85 కోట్ల పనులకు శంకుస్థాపన
ఏలూరు, అక్టోబరు 13: గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి శంకుస్థాపన చేశారు. తోటపల్లిలో రూ.1.20 కోట్లతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో శ్మశానవాటిక, రూ.25 లక్షలతో వాటర్‌ ట్యాంకు పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని, అభివృద్ధి పనులకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు.