The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో చతుర్వేద పారాయణం

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో చతుర్వేద పారాయణం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

గాయత్రీ దేవిగా మావుళ్ళమ్మ

వైభవంగా వేదసభ

వేదమంత్రాల నడుమ అమ్మవారికి పంచహారతులు

భీమవరం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 30 మంది వేదపండితులతో నిర్వహించిన చతుర్వేద పారాయణం, వేదసభ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేదపండితులు పాల్గొన్నారు.
దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నేతృత్వంలో నాలుగు వేదాల్లోని ఎంపిక చేసిన మంత్రాలను పండితులు శ్రావ్యంగా పారాయణం చేశారు. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అనంతరం చతుర్వేద పారాయణంతో నిర్వహించిన అమ్మవారి పంచహారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిశి మీనాక్షి, అరసవల్లి సుబ్రమణ్యం, అతికేల ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.