🟡 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :
చింతలపూడి ఎత్తిపోతల పనులు త్వరలో ప్రారంభం
➖ఎంపీ పుట్టా మహేష్
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అయ్యపరాజుగూడెం–కలరాయణగూడెం మధ్య రూ.2.5 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం అయ్యపరాజుగూడెంలో పెన్షన్ల పంపిణీ, ‘పేదల సేవలో 2.0’ గ్రామసభలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ.. వివిధ వర్గాలకు నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పెన్షన్లు అందిస్తూ, ఏటా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
చింతలపూడికి త్వరలో జలకళ :
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగిపోయాయని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని మహేష్‌కుమార్ తెలిపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో పనులు వేగంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే చింతలపూడి, నూజివీడు మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందడంతో పాటు చెరువులు నిండే అవకాశం ఉందని, భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.

