The Desk … Tadepalligudem : స్వచ్ఛ ఆంధ్రతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం

The Desk … Tadepalligudem : స్వచ్ఛ ఆంధ్రతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం

🔴 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం : డెస్క్ :

గూడెంలో ఘనంగా SASA కార్యక్రమం

అవగాహన ర్యాలీ, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ

స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంతోనే స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందని తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్‌ ఎం. యేసుబాబు అన్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే SASA (స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర) కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత, పారిశుధ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగింది. అనంతరం సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

సందర్భంగా కమిషనర్‌ యేసుబాబు మాట్లాడుతూ :

పట్టణ పరిశుభ్రత కేవలం పురపాలక సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

పట్టణంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు మున్సిపల్‌ యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ డి. భవానీ బాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌ వై. వెంకట రమణ, రెవెన్యూ ఆఫీసర్‌ పి. ప్రసాద్‌తో పాటు పురపాలక అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.