🟡 గుంటూరు : ది డెస్క్ :

పెన్ను పట్టిన ప్రజాప్రతినిధి
బాధ్యతలు ఓవైపు – విద్య మరోవైపు
ప్రజా జీవితంలో విష పరీక్ష
నిజ జీవితంలో “లా” పరీక్ష
ప్రజాప్రతినిధిగా ఓ మెట్టు
విద్యార్థినిగా మరో మెట్టు
సౌమ్య ఆసక్తి – యువతకు స్ఫూర్తి
ప్రజా జీవితంలో నిత్యం తీరికలేని కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. మరోవైపు విద్యార్థినిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
శనివారం గుంటూరులోని జె.సి. కాలేజీలో నిర్వహించిన లా మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షకు ఆమె హాజరయ్యారు.
ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండే సౌమ్య.. చదువుకు కూడా సమయం కేటాయించడం విశేషంగా నిలిచింది. సాధారణ విద్యార్థినిలాగే పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశారు.
ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే న్యాయ విద్యను అభ్యసించడం ద్వారా వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఆసక్తిని ఆమె చాటుకున్నారు.
న్యాయ విద్య ద్వారా ప్రజలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై మరింత అవగాహన పెంచుకోవడంతో పాటు, తన ప్రజాసేవకు ఇది మరింత దోహదపడుతుందనే ఉద్దేశంతో ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు.
బాధ్యతలు ఎన్ని ఉన్నా.. నేర్చుకోవాలనే తపనకు అవి అడ్డంకి కావన్న సందేశాన్ని తంగిరాల సౌమ్య తన ఆచరణతో చాటుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు కూడా నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనకు ఆమె చూపుతున్న ఆసక్తి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

