🟡 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పలు మౌలిక వసతుల పనులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.
ఉంగుటూరు మండలంలో మొత్తం రూ.2.20 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, పంచాయతీ భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన మార్గంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం నల్లమాడు గ్రామంలో రూ.1.48 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు తెలిపారు.
అలాగే నల్లమాడు గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ పంచాయతీ పరిపాలనా కార్యకలాపాలకు మరింత సౌకర్యం కలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ :
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన రహదారులు, పంచాయతీ భవనాలు వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

