🔴 కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

మూడు కీలక అంశాలపై జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో వినతులు
యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్స్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో మూడు కీలక ప్రజా సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు.

34,006 హెక్టార్ల మడ అడవులను కాపాడాలని విజ్ఞప్తి :
కృష్ణా జిల్లాలోని మడ అడవుల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్టీఐ కార్యకర్తలు కోరారు. మచిలీపట్నం డివిజన్‌లో 10,850 హెక్టార్లు, అవనిగడ్డ డివిజన్‌లో 23,156 హెక్టార్లు కలిపి మొత్తం 34,006 హెక్టార్ల మడ అడవులు ఉన్నాయని పేర్కొన్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, అక్రమ దారులు, ఆక్రమణలు, క్రిమినల్ కేసులపై చర్యలు తీసుకుని మడ అడవులను పరిరక్షించాలని కలెక్టర్‌ను కోరారు.

497 గ్రామ పంచాయితీల్లో అవినీతిపై విచారణకు ఫిర్యాదు :
సర్పంచులు, కార్యదర్శులపై చర్యలకు డిమాండ్ :
కృష్ణా జిల్లాలోని 497 గ్రామ పంచాయితీల్లో సర్పంచుల పదవీకాలం ముగిసే ముందు డీజిల్, పెట్రోల్ తదితర ఖర్చుల పేరుతో ఎస్టిమేట్లు, ఎం-బుక్ నమోదు, టెండర్లు లేకుండానే లక్షలాది రూపాయల నిధులు డ్రా చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆర్‌టీఐ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీకి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
దుర్వినియోగమైన నిధులను రెవెన్యూ రికవరీ చట్టం–1864 ప్రకారం తిరిగి వసూలు చేయడంతో పాటు, G.O.Ms.No.458 (22-09-2009) నిబంధనల మేరకు బాధ్యులైన పంచాయితీ కార్యదర్శులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ సేవల నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు.
1.47 సెంట్ల కామన్ సైట్ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి :
ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలోని సర్వే నంబర్లు 218, 219, 228 తదితర పరిధిలో ఉన్న సుమారు 1.47 సెంట్ల కామన్ సైట్ భూమిని ప్రభుత్వ మెమో (REV.08-22057/11/2024, తేదీ 07-03-2025) ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులను సరిచేసి ప్రభుత్వ ఆస్తిగా నమోదు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మూడు అంశాలపై జిల్లా యంత్రాంగం స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్స్ ప్రతినిధులు జంపాన శ్రీనివాస గౌడ్, బొల్లా శివపార్వతి కోరారు.

