🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : కంచికచర్ల : ది డెస్క్ న్యూస్ :
గురువుకు గురుదక్షిణగా సర్పంచ్ పీఠం
మాస్టారుకు మద్దతుగా పూర్వ విద్యార్థులు
మూడు దశాబ్దాల బోధన – ఇప్పుడు ప్రజాసేవకు సిద్ధం
కంచికచర్లలో మైనారిటీ అభ్యర్థిత్వంపై ఆసక్తికర చర్చ
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మార్పుతో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో రాజకీయ వేడి రాజుకుంది. తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కంచికచర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ దస్తగిరి మాస్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయనకు వేలాది మంది పూర్వ విద్యార్థుల పరిచయాలు, స్థానికంగా మంచి గుర్తింపు ఉండటం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు మైనారిటీ వర్గానికి సర్పంచ్ అవకాశం దక్కని నేపథ్యంలో ఈసారి ఆయన అభ్యర్థిత్వంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తమ గురువుకు సర్పంచ్ పీఠం దక్కితే గురుదక్షిణగా విజయాన్ని అందిస్తామని పూర్వ విద్యార్థులు అంటున్నారు.
ఇదిలా ఉండగా, అభ్యర్థిత్వాన్ని కోరుతూ దస్తగిరి మాస్టర్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ నాయకులంతా చర్చించుకుని ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం. దీంతో కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

