🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాంకింగ్లో ఏలూరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని 33వ డివిజన్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
రిలయన్స్ పెట్రోల్ బంకు సెంటర్ నుంచి లోబ్రిడ్జి వరకు నిర్వహించిన స్వచ్ఛతా ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే.. స్వయంగా చెత్తను తొలగించి, చీపురుతో రహదారిని శుభ్రం చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ ఏ. భానుప్రతాప్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఏలూరు సాధ్యమవుతుందన్నారు. తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్యంపై నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్న అధికారులను అభినందించారు. స్వచ్ఛతలో ఏలూరును అగ్రపథంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు.

