కైకలూరు/దేవరపల్లి : ది డెస్క్ :
ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.

ముఖ్యంగా పొగాకు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పొగాకు ధరల తగ్గుదల, పంట కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేవరపల్లికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ మంత్రి తానేటి వనిత, శాసనమండలి సభ్యుడు తలశిల రఘురాం, మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజుతో కలిసి ఏలిపాడులోని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
సభ నిర్వహణ, ప్రజల రాకపోకలు, వేదిక ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై నాయకులు చర్చించి అవసరమైన సూచనలు చేశారు. రైతుల సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తీసుకురావడంలో ఈ సభ కీలకంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

