The Desk…Machilipatnam :  జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ

The Desk…Machilipatnam : జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్ సర్వే నిమిత్తం జిల్లాకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజ్ ప్రియ్ సింగ్ బృందానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో కేంద్ర బృందంతో కలిసి అధికారులతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్ సర్వేపై సమీక్షించారు.

ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు, సమస్యలు తెలియజేయాలని కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను కోరారు. కృష్ణాజిల్లా డెల్టా ప్రాంతమని, ఇక్కడ వ్యవసాయం, మత్స్య సాగు అధికమని, వైవిధ్యం కలిగిన జిల్లాలో కలంకారి, రోల్డ్ గోల్డ్ నగల తయారీ, కూచిపూడి నృత్యం వంటి వాటికి ప్రసిద్ధి అని తెలిపారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అయితే సరఫరాకు అవసరమైన స్టోరేజ్ ట్యాంకులు ప్రధాన సమస్యగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా పేరుకుపోయిన చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు పెద్ద మొత్తంలో భారీ వాహనాలు, వాటి నిర్వహణకు నిధులు అవసరమన్నారు.

వ్యాపారం చేసుకునే డ్వాక్రా సంఘాల మహిళలకు అధిక రుణాలు మంజూరు, ఉత్పత్తి చేసిన వారి వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, వ్యాపార మెళకువలు కోసం శిక్షణ తరగతులు నిర్వహించడం కీలకమన్నారు. తీర ప్రాంతంలోని నేలల ప్రభావం వల్ల ఇళ్ల నిర్మాణ పునాది పట్టిష్టంగా నిర్మించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉందని,

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలకు ఒక యూనిట్ కు అందించే రూ.1.8 లక్షల నగదును పెంచాల్సినఅవసరం ఉందన్నారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.

కేంద్ర బృందం ప్రతినిధులు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ మురుగుకాల్వలు, పారిశుధ్య పనులు, ఇంటింటికీ తాగునీరు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త నిర్వహణ, కంపోస్టు ఎరువు తయారీ వంటి అంశాలపై ప్రత్యేక ఫార్మాట్‌లో ప్రజల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఆరోగ్యకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, వాటి ద్వారా అందుతున్న సేవలను పరిశీలిస్తున్నారు.

సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ కేశవ్ రోజ్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటరావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు తదితరులు పాల్గొన్నారు.