ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్లతో కలిసి రాష్ట్ర మంత్రి సవిత సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సగర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం నుండి గజ్జల గణేష్ సగర కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గజ్జల గణేష్ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసినందుకు, నియోజకవర్గ నాయకుల మద్దతుతో ఈ పదవి లభించిందని తెలిపారు. ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ అందించిన ప్రోత్సాహం, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో సగర వర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. సగర కార్పొరేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి కార్యాలయం నుండి అధికారికంగా జారీ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో సగర సామాజికవర్గీయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

