ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
ఉండి మండలం పెద్దపేట గ్రామానికి చెందిన బేతపూడి రవి (30) సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
కైకలూరు టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి ఆకివీడు నుండి కైకలూరు వైపు తన హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌పై వెళ్తుండగా ఆటపాక గ్రామం వద్ద ఒక ప్రైవేట్ బస్సును కుడివైపు నుంచి ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో అతనికి తలకు తీవ్ర గాయమైంది. అధిక రక్తస్రావం కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ప్రమాద సమయంలో రవి హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు బలమైన గాయం తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెట్ వినియోగం ప్రాణాలను కాపాడగలదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కైకలూరు టౌన్ పోలీసులు సూచించారు.

